Posts

 పరమోత్కృష్ట వికాసమానవిలసత్పద్మాటవీ సంస్థితా సురగంధర్వులకైన బోధపడునే శోధింప తద్రూపమే, నరసింహాధ్వరి, వారి సోదరులు నానారీతి నర్చింపగన్, చిరకాలంబుగ నిన్ను నమ్మితిమికన్ శ్రీ రాజరాజేశ్వరీ! తా:  దేవతలకు కూడా బోధపడని  సహస్రదళ పద్మమధ్యమున విరాజిల్లు నీరూపమును నృసింహ దీక్షితులు వారి సోదరులు (నృహరి దీక్షితులు) అర్చించారు. వారి బిడ్డలమైన మేమూ నిన్నర్చిస్తున్నాము. 🙏🙇🏼‍♂️🙏
సమస్యా: చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే నా ప్రయత్నం:  వరగుణ పల్లవాధరను, బావకొసంగుచు బెండ్లి సేయగన్ మురిపము తోడుతన్ జన నపూర్వహిమాలయ పర్వతమ్ములన్, గిరణము లేమి చేయు మరు కేళిని  మున్గ వినూత్న రీతిగన్, చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే.
 "గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా." ప్రయత్నం: సిరితో దూగెడి వారలెల్ల ధరణిన్ శ్రీనాథులై వెల్గరే! ధర నేలన్గల వారలందరు నహో ధాత్రీశులై యొప్పరే! హర! లేరెవ్వరు నీకు సాటియనుచున్ హర్షాతి రేకంబునన్ గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా.
" రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్." ప్రయత్నం: భీముబలంబునన్ గెలిచె భీకర పోరుల లోకపాలురన్ గోమలి దేవవేశ్యనతి క్రూరముగా సెడగొట్టె దుష్టుడై, ధీమతి యౌనె రావణుడు దేవగణంబులఁ గెల్చి? యింద్రియా రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్. ఇంద్రియారాముఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్య) విషయలోలుఁడు.
 "తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్." హాటక గర్భుడున్ హరి హరాదులు గొల్వ నిరంతరమ్ముగా గోటి రవిప్రభాసమగు గుబ్బలిపట్టిని; సృష్టికెల్ల నీ నాటికి కాలమానముల నాస్పదమైన మరీచిమాలి వా తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్. గుబ్బలిపట్టి- అమ్మవారు మరీచిమాలి-సూర్యుడు వాతాట- సూర్యుని గుఱ్ఱము
 "దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్" జారఁగ భారమై ధర రసాతల లోకము లోనికంతటన్ క్రూర హిరణ్యనేత్రుఁ ననిఁ గూల్చిన యజ్ఞవరాహ రూపి, యు ద్ధారణ జేసిజూపెను ముదంబుగ కోరలపై భవిష్ణు, భూ దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్. భవిష్ణు-కాగల స్వభావం గలవాడు(ఆం.భా)
 "జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్." ప్రయత్నం: శమము వహించి పాలకులు సంపద దోచక నీతి నెప్డు జి త్తమున దలంచి సర్వ జనతానుత పాలన సేయ నెంచి, క్షా మము దఱి జేరనీక జనమంతయు యొక్కటి కావలెన్, సమా జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్.
 "ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె క్రీడియే" ప్రయత్నం: ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె క్రీడియే దృఙ్నవ కావ్య శోధకుడ! ధీమణి! పుచ్ఛక ప్రౌఢ! పుష్కర స్రఙ్నవ మాల వేసి, తమ సాటిఁక లేరని సెప్పవచ్చు, భూ భుఙ్నవ సాహితీ ప్రియులు బూరణ సేయుట సాధ్యమౌనటే? 🙏🏻🙏🏻 దృక్-చూచువాడు పుష్కర స్రక్ - నల్లకలువలు భూభుక్-రాజు యజ్ఞభగవాన్ గంగాపురం
 "రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై." నా ప్రయత్నం. రాముని నమ్మి నంతటనె, లంకకు రాజును సేయ, తన్మహో ద్ధామ కరంబుచే నభయ దానము నొంద, విభీషణున్ గనన్ రామ జపంబునన్ సతము రాజిలు నా హనుమంతుడిట్లనెన్  రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై.
 "అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్" క్రొత్తగ దేశ భావనల కోతలు కోయుచు పాలకుండు వా గ్దత్తములెన్నియో పుణికి గర్వము తోడుత, కేంద్రమన్న నా చిత్తము లోపలన్ భయము చేతలనే గన నిట్లు తోచెడిన్ అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్. వాగ్దత్తము-వాగ్దానము
 "పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్" రక్షోనాథుడు రావణుండవనిజన్ లంకించి కొంపోవగా దీక్షాదక్షులు నాంజనేయ ప్రముఖుల్ దీనంబుగా నుండగా, బక్షీంద్రుం డెరిగింప,సీత పొడ సంప్రాప్తింప సంపాతికిన్  పక్షంబుల్ దెగి పడ్డ ప క్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
 "గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా" భరమై తోచును జీవనమ్ము పుష్పలిహమై వారాంగణాన్వేషణన్ శరమున్ సిగ్గును లేని యీ వెకలి సంసారంబు లింకేల? దు స్తర గంభీర భవాబ్ధి దాటుటకునై సారింపుమా దృష్టి,... డిం గ రిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా! పుష్పలిహము-తుమ్మెద డింగరి-భక్తుడు, సేవకుడు
 "భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో" జనపదు లంత నాగమను జాణ యటంచును నింద సేతురే, నిజమును సెప్పబూనరు వినిర్మల బుద్దిని; న్యాయశీలి, భే  షజమును వీడి కావగ సైన్యము నంతయు రాయబారమే ప్రజలకు మేలు గూర్చు నని, ప్రాణము సైతము లెక్క జేయదే! భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో.
వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్  వృద్ధిన్వెల్గెడు పాండవోత్తముడునౌ భీభత్సు పుత్రుండునై, బోద్ధా మాతుల యొద్ద విద్య నెరపెన్ ముద్దార నేర్పించగన్ యుద్ధంబందున తమ్మిమొగ్గరమునన్ యొడ్డార ద్రోణాదులన్ వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్ బోద్ధా-బోధకర్త ఒడ్డారించు-ఎదుర్కొను తమ్మిమొగ్గరము-పద్మవ్యూహము.
 *సిలువ -చర్చి-యేసు-క్రీస్తు* పదాలనుయోగించి విష్ణు స్తుతి: చందన చర్చిత దేహము నందమునన్ భాసిలు వరహారము, సిరియే సుందర మూర్తిగ నెలవగు, చందంబును గొల్తు నిన్ను చక్రీ! స్తుతులన్. యజ్ఞభగవాన్ గంగాపురం

సమస్యా పూరణం

 సమస్య: దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. శోషితదానవుండు మధుసూదను డండగ కౌరవేంద్రతా శేషవిభూతిఁ బాండవుల చేతి కొసంగెను జేరదీసి సం తోషము నింపె, యుద్ధమున దోషుల నంపెను దేవభూమి, ని ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. దేవభూమి -స్వర్గము
 2.7.2022 సమస్య: భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్. శ్రీ లక్ష్మీ దేవి మానసము నందలి భావనతో నా ప్రయత్నం: మూర్తులు ముగ్గురుండఁ దుది మోహన రూపుని మాయఁ మున్గితిన్, పూర్తిగ నమ్మి వేడినను బొత్తిగ నుండడు చెంతనెప్డు, దా నార్తులు కుయ్యిడన్ బఱగు నాలిని వీడుచు దన్ను మర్చి, నా భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్.

పాఠశాల

 సెలవుల అనంతరం ప్రారంభమైన పాఠశాలలలో పిల్లల సందడిని వర్ణిస్తూ ఉత్పలమాల పద్యం చెప్పండి 1వ పాదం 4వ అక్షరం 'పా' 2వ పాదం 11వ అక్షరం 'ఠ' 3వ పాదం 16వ అక్షరం 'శా' 4వ పాదం 19వ అక్షరం 'ల' ప్రయత్నం: ఆటల పాటలన్ మునిగి హాయిగ నాడెడి బాలబాలికల్ వాటిక లెల్లవీడి యిక పాఠము లందున దృష్టి నిల్పుచున్ మూటల నిండ పొత్తముల బుద్ధిగ నేర్వగ, శాస్త్రవేత్తలే సాటిగ రారు మాకనుచు సాగిరి ముద్దుగ పాఠశాలకున్.
 శంకరాభరణం సమస్య: 8.5.22 నెలతల గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్. ఇలఁ గల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై వెలిఁగెడి మూల మమ్మయె, పవిత్ర జనాంతములందు శక్తి పెం పలరఁ ననేక రీతుల మహత్తర మాతృక లైన యమ్మ ల న్నెలతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్. జనాంతము-గ్రామము
  *లడ్డు-బూరె-అరిసె-కాజా* పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. శ్రీ కృష్ణ రాయబారం. ప్రయత్నం: పరు లెవ్వరోసుయోధన! యరిసెముతో బాండు సూను లడ్డను కొనకన్ దరిఁజేరి పురంబూరే గరుగుము, కాజాలరెవ్వ రడ్డిక బావా! అరిసెము- ప్రేమ, హర్షము

ఉత్సాహ

 ప్రథమ ప్రయత్నం. ఉత్సాహము. శ్రీనృసింహ! శ్రీనృసింహ! శ్రీనృసింహ! పాహిమామ్ శ్రీనృసింహ! శ్రీనృసింహ! శ్రీనృసింహ! రక్షమామ్ మేను పులకరింప నిన్ను మేడిపూరి భక్తులే వేనవేల పూల నిన్ను వేడుకొనగ గావుమా! కుంభినిన్ వరించి కాచి క్రోధరూపమెత్తుచున్ స్తంభమందు వెలసి దుష్ట సంఘములను దృంచితే! దంభ మెంచబోకుమయ్య! దారిజూపు శ్రీహరీ! శంభు తోడ వెలసి తీవు సర్వ భక్త పాలకా!