Posts

Showing posts from December, 2022
 "గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా." ప్రయత్నం: సిరితో దూగెడి వారలెల్ల ధరణిన్ శ్రీనాథులై వెల్గరే! ధర నేలన్గల వారలందరు నహో ధాత్రీశులై యొప్పరే! హర! లేరెవ్వరు నీకు సాటియనుచున్ హర్షాతి రేకంబునన్ గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా.
" రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్." ప్రయత్నం: భీముబలంబునన్ గెలిచె భీకర పోరుల లోకపాలురన్ గోమలి దేవవేశ్యనతి క్రూరముగా సెడగొట్టె దుష్టుడై, ధీమతి యౌనె రావణుడు దేవగణంబులఁ గెల్చి? యింద్రియా రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్. ఇంద్రియారాముఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్య) విషయలోలుఁడు.
 "తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్." హాటక గర్భుడున్ హరి హరాదులు గొల్వ నిరంతరమ్ముగా గోటి రవిప్రభాసమగు గుబ్బలిపట్టిని; సృష్టికెల్ల నీ నాటికి కాలమానముల నాస్పదమైన మరీచిమాలి వా తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్. గుబ్బలిపట్టి- అమ్మవారు మరీచిమాలి-సూర్యుడు వాతాట- సూర్యుని గుఱ్ఱము
 "దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్" జారఁగ భారమై ధర రసాతల లోకము లోనికంతటన్ క్రూర హిరణ్యనేత్రుఁ ననిఁ గూల్చిన యజ్ఞవరాహ రూపి, యు ద్ధారణ జేసిజూపెను ముదంబుగ కోరలపై భవిష్ణు, భూ దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్. భవిష్ణు-కాగల స్వభావం గలవాడు(ఆం.భా)
 "జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్." ప్రయత్నం: శమము వహించి పాలకులు సంపద దోచక నీతి నెప్డు జి త్తమున దలంచి సర్వ జనతానుత పాలన సేయ నెంచి, క్షా మము దఱి జేరనీక జనమంతయు యొక్కటి కావలెన్, సమా జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్.
 "ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె క్రీడియే" ప్రయత్నం: ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె క్రీడియే దృఙ్నవ కావ్య శోధకుడ! ధీమణి! పుచ్ఛక ప్రౌఢ! పుష్కర స్రఙ్నవ మాల వేసి, తమ సాటిఁక లేరని సెప్పవచ్చు, భూ భుఙ్నవ సాహితీ ప్రియులు బూరణ సేయుట సాధ్యమౌనటే? 🙏🏻🙏🏻 దృక్-చూచువాడు పుష్కర స్రక్ - నల్లకలువలు భూభుక్-రాజు యజ్ఞభగవాన్ గంగాపురం
 "రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై." నా ప్రయత్నం. రాముని నమ్మి నంతటనె, లంకకు రాజును సేయ, తన్మహో ద్ధామ కరంబుచే నభయ దానము నొంద, విభీషణున్ గనన్ రామ జపంబునన్ సతము రాజిలు నా హనుమంతుడిట్లనెన్  రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై.
 "అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్" క్రొత్తగ దేశ భావనల కోతలు కోయుచు పాలకుండు వా గ్దత్తములెన్నియో పుణికి గర్వము తోడుత, కేంద్రమన్న నా చిత్తము లోపలన్ భయము చేతలనే గన నిట్లు తోచెడిన్ అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్. వాగ్దత్తము-వాగ్దానము
 "పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్" రక్షోనాథుడు రావణుండవనిజన్ లంకించి కొంపోవగా దీక్షాదక్షులు నాంజనేయ ప్రముఖుల్ దీనంబుగా నుండగా, బక్షీంద్రుం డెరిగింప,సీత పొడ సంప్రాప్తింప సంపాతికిన్  పక్షంబుల్ దెగి పడ్డ ప క్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
 "గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా" భరమై తోచును జీవనమ్ము పుష్పలిహమై వారాంగణాన్వేషణన్ శరమున్ సిగ్గును లేని యీ వెకలి సంసారంబు లింకేల? దు స్తర గంభీర భవాబ్ధి దాటుటకునై సారింపుమా దృష్టి,... డిం గ రిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా! పుష్పలిహము-తుమ్మెద డింగరి-భక్తుడు, సేవకుడు
 "భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో" జనపదు లంత నాగమను జాణ యటంచును నింద సేతురే, నిజమును సెప్పబూనరు వినిర్మల బుద్దిని; న్యాయశీలి, భే  షజమును వీడి కావగ సైన్యము నంతయు రాయబారమే ప్రజలకు మేలు గూర్చు నని, ప్రాణము సైతము లెక్క జేయదే! భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో.
వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్  వృద్ధిన్వెల్గెడు పాండవోత్తముడునౌ భీభత్సు పుత్రుండునై, బోద్ధా మాతుల యొద్ద విద్య నెరపెన్ ముద్దార నేర్పించగన్ యుద్ధంబందున తమ్మిమొగ్గరమునన్ యొడ్డార ద్రోణాదులన్ వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్ బోద్ధా-బోధకర్త ఒడ్డారించు-ఎదుర్కొను తమ్మిమొగ్గరము-పద్మవ్యూహము.
 *సిలువ -చర్చి-యేసు-క్రీస్తు* పదాలనుయోగించి విష్ణు స్తుతి: చందన చర్చిత దేహము నందమునన్ భాసిలు వరహారము, సిరియే సుందర మూర్తిగ నెలవగు, చందంబును గొల్తు నిన్ను చక్రీ! స్తుతులన్. యజ్ఞభగవాన్ గంగాపురం

సమస్యా పూరణం

 సమస్య: దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. శోషితదానవుండు మధుసూదను డండగ కౌరవేంద్రతా శేషవిభూతిఁ బాండవుల చేతి కొసంగెను జేరదీసి సం తోషము నింపె, యుద్ధమున దోషుల నంపెను దేవభూమి, ని ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. దేవభూమి -స్వర్గము